AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సైబర్‌ నేరగాళ్ల వలలో మరో మహిళ

ఉద్యోగం అంటూ ఆశచూపి రూ.5లక్షలు కొల్లగొట్టారు

మహిళలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల ఎత్తులు రోజురోజుకూ సృతి మించుతున్నాయి. తాజాగా తెలంగాణలోని అబిడ్స్‌లో ఓ యువతి వీరి మాయలోపడి రూ.5 లక్షలు పోగొట్టుకుంది. బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్న యువతి మొబైల్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే రోజూకు అరగంట పని చేసుకుని రూ.700ల నుంచి 900ల వరకు సంపాదించొచ్చంటూ ఆశ చూపారు. అందుకు ముందుగా రూ.2,000 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కట్టించుకున్నారు. నెల తర్వాత డిజిటల్‌ ఖాతాలో రూ.28 వేల ఆదాయం చూపారు. ఆ మొత్తం సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అదనంగా రూ.50 వేలు డిపాజిట్‌ చేయాలనే షరతు పెట్టారు. సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్‌ పెంచుతూ వచ్చారు. ఈ క్రమంలో రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయించుకొని చెప్పాపెట్టకుండా ఖాతా రద్దు చేశారు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను సంప్రదించింది.

ఇలా ఫోన్లకు తొలుత పార్ట్‌టైం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అంటూ మెసేజ్‌లను పంపించి ఆశల వల విసురుతున్నారు. గతంలో దీపాల వత్తులు, కరక్కాయ పొడి, బుక్స్‌ పీడీఎఫ్‌గా మార్చి రూ.లక్షలు సంపాదించమంటూ సామాజిక మాధ్యమాల వేదికగా మోసగాళ్లు చెలరేగారు. వీరి వలలో గృహిణులు, యువతులు అధికంగా చిక్కుకుంటున్నారు. నగరంలో సైబర్‌ క్రైమ్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఉద్యోగం, పెట్టుబడులకు సంబంధించిన మోసాలే ఉంటున్నాయి. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఉద్యోగ వేటలో ఉన్న యువతులు తేలికగా బుట్టలో పడుతున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో 2-3 గంటలు కష్టపడితే చాలనే ఉద్దేశంతో బాధితులు అవతలి వారి మాటలను నమ్ముతూ ఉచ్చులో చిక్కుతున్నారు. ఇంట్లో ఉంటూ సంపాదించే అవకాశం ఉందనగానే తేలికగా నమ్మి సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు వచ్చే ఇటువంటి ప్రకటనలు నమ్మొద్దు. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండంటూ హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ డీసీపీ నేహా మెహ్రా సూచించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10