AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైఎస్ షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత..

తోపులాటలో కిందపడిపోయిన వైఎస్సార్టీపీ అధినేత్రి
వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాలు లేవని.. రోగులకు అరకొర వైద్య సదుపాయాలు అందుతున్నాయంటూ ఆమె ఇవాళ ‘ఛలో ఉస్మానియా’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఉస్మానియా ఆసుపత్రికి బయల్దేరేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లోటస్‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, వైఎస్సాఆర్‌టీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో షర్మిల కిందపడిపోయారు.

ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల.. సీఎం కేసీఆర్ నియంత పాలన మరోసారి నిరూపితం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలను ఎక్కడికి వెళ్లకుండా గృహనిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాలను అడ్డుకోవటానికి శాంతి భద్రతల సమస్య అంటారా ? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడితే హౌజ్ అరెస్టులు చేస్తున్నారన్నారు. మొన్న రేవంత్ రెడ్డిని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కూడా అరెస్టు చేశారన్నారు. ప్రజల పక్షాన నిలబడటం తప్పా ? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సీఎం నెరవేర్చలేదని షర్మిల విమర్శించారు. ప్రజల తరఫున గొంతు వినిపిస్తే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్టీపీని, వైఎస్సార్‌ బిడ్డను చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను చేస్తున్న పాదయాత్రను అడ్డుకున్నారని షర్మిల మండిపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని ధ్వజమెత్తారు. రూ.200 కోట్లతో టవర్స్ కడతామని చెప్పిన సీఎం ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని షర్మిల ఆక్షేపించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10