మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్‌న్యూస్ తెలిపారు. నగరంలోని వైన్ షాపులతో పాటు బార్లను ఒకరోజు పాటు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లోని మద్యం షాపులను బంద్ చేయాలని పోలీసులు యాజమానులను ఆదేశించారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శోభాయాత్ర జరుగుతుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పండుగ రోజు మద్యం షాపులను బంద్ చేయించనున్నారు.
30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ నుంచి ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. వైన్ షాపులతో పాటు బార్లు, క్లబ్‌లు, పబ్బులు, ఫైవ్‌స్టార్ హోటళ్లలోని బార్ రూమ్‌లను కూడా క్లోజ్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశించారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా శ్రీరామనవమి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మద్యం షాపులను మూసివేయించనున్నట్లు స్పష్టం చేశారు.
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి వైన్ షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అలాగే బ్లాక్ మార్కెట్‌లో కూడా మద్యం విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. తాము ఎక్కడికక్కడ పరిస్థితిని నిశితంగా పరీశీలిస్తామని పోలీసులు తెలిపారు.