కేంద్ర పర్యావరణ మంత్రి బుధవారం రోజున ఓ శుభవార్త తెలిపారు. ప్రధానీ మోదీ నాయకత్వంలో నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో ఓ చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందంటూ ట్వీట్ చేశారు. భారత వన్యప్రాణుల పరిరక్షణలో ఇదో ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. చిరుతలను ఇక్కడికి తీసుకొచ్చేలా కృషి చేసిన బృందానికి అభినందనలు తెలిపారు. 1952 లో భారత్ లో చిరుత పులులు అంతరించిపోయాక దాదాపు 70 ఏళ్ల తర్వాత మొదటి సారి ఓ చిరుత నాలుగు పిల్లలకు జన్మనివ్వడం విశేషం.
గత ఏడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఐదు ఆడ చిరుతలు, మూడు మగ చిరుతలు ఉన్నాయి. వీటన్నింటికీ పేర్లు కూడా పెట్టారు.
ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో వీటిని విడుదల చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 18న సౌత్ ఆఫ్రికా నుంచి మరో 12 చిరుతలను కూడా అధికారులు తీసుకొచ్చి ఆ పార్కులో వదిలేశారు. అయితే సోమవారం రోజున సాషా అనే చిరుత కిడ్ని సమస్యతో మరణించినట్లు మధ్యప్రదేశ్ లోని అటవీ అధికారులు ప్రకటించారు.