వివేకా హత్య కేసులో కీలక పరిణామం..
న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Case)లో దర్యాప్తు అధికారిపై వేటు పడింది. సీబీఐ ఎస్పీ రాంసింగ్ (CBI SP RamSingh)ను తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాంసింగ్ వల్లే వివేకా హత్య కేసు విచారణ ఆలస్యం అయిందని, దర్యాప్తు వేగంగా సాగటం లేదని ఏఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారిగా రాంసింగ్‌ను తొలగిస్తూ సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగటం లేదని.. దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.
గత విచారణలో దర్యాప్తు అధికారిని మార్చాలని.. లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక అందజేసింది. రాంసింగ్‌తో పాటు మరొకరి పేరును సీబీఐ సూచించింది. అయితే రాంసింగ్‌ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్‌ను కొనసాగించడంలో అర్ధం లేదని న్యాయమూర్తి అన్నారు. వివేకా కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తొలగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.