ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకి డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ టీమ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌కి ముందు ఐపీఎల్ 2023 ఆరంభోత్సవాన్ని (IPL 2023 Opening Ceremony) స్టేడియంలో నిర్వహించబోతున్నారు. 2018 తర్వాత ఐపీఎల్ ఆరంభోత్సవం జరుగుతుండటం ఇదే తొలిసారి.
నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రారంభోత్సవం ప్రారంభంకానుంది. ఈ ఈవెంట్‌లో పాన్ ఇండియా హీరోయిన్స్ రష్మిక మందన, తమన్నా భాటియా డ్యాన్స్ చేయబోతున్నారు. అలానే పాపులర్ సింగర్ అరిజిత్ సింగ్ లైవ్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. అలానే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్‌ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2019 సీజన్‌కి ముందు కూడా ఆరంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. కానీ.. పుల్వామా దాడిలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఆరంభోత్సవాన్ని రద్దు చేసి.. ఆ ఖర్చుని సైనికుల ఫ్యామిలీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అందించింది. ఆ తర్వాత 2020 నుంచి 2022 వరకు కరోనా కారణంగా ఆరంభోత్సవాన్ని ఏర్పాటు చేయలేదు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోటీపడనుండగా.. ఈ రోజు నుంచి మే 28 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో 58 రోజుల పాటు మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈరోజు మ్యాచ్‌లో ఆడబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలవగా.. గుజరాత్ టైటాన్స్ గత ఏడాది టైటిల్ విన్నర్‌గా నిలిచింది.