పార్టీ కోసం కష్టపడ్డా.. ఎన్నికల్లో పనిచేసిన నన్ను పక్కన పెట్టడం సరికాదు : కడియం శ్రీహరి
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నియోజక వర్గాల్లో పర్యటిస్తూ.. ప్రజలకు హామీలు, సమస్యలు నెరవేస్తున్న కడియం.. కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. స్థానిక నాయకులతో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలకు తనను పిలువట్లేదంటూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను ఉద్దేశించి కామెంట్ చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గెలుపునకు కృషిచేశానని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ప్రచారం చేశానని.. అయినా తనను పార్టీ సమావేశాలకు పిలువకుండా పక్కన పెడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిస్వార్థంగా పనిచేశానని.. ఆ విషయాన్ని ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడని కడియం శ్రీహరి గుర్తు చేశారు. ఇకనైనా అందరిని కలుపుకుని పోవాలని, లేనట్లయితే పార్టీలో విభేదాలు వస్తాయని ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.