AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అత్తారింటి ముందు అల్లుడి ధర్నా

తమకు న్యాయం చేయాలంటూ మహిళలు అత్తారింటి ముందు ధర్నాలు చేయడం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు రివర్స్ సీన్ చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ అత్తారింటి ముందు అల్లుడు ఆందోళనకు దిగాడు. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది.

కోదాడకు చెందిన రమణితో 2018లో హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్ కుమార్‌కు పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ మగబిడ్డ కూడా జన్మించాడు. అయితే మూడేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు వచ్చాయి. గొడవల కారణంగా తన కొడుకుని తీసుకుని భార్య రమణి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించి రమణి కెనడాకు వెళ్లిపోయింది.

అయితే తన కొడుకుని తనకు చూపించాల్సిందిగా అత్తామామలను అల్లుడు కోరగా.. వాళ్లు అనుమతించలేదు. దీంతో దీనిపై ప్రవీణ్ కుమార్ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన కుమారుడిని చూసే హక్కు తనకు ఉందని, కొడుకుని అత్తారింటివారు చూపించడం లేదని పిటిషన్ వేశాడు. తన కొడుకుని తన దగ్గరకు రానివ్వడం లేదని, కుమారుడిని తనకు చూపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరాడు. ఈ పిటిషన్‌పై వాదోపవాదనలు విన్న కోర్టు.. ప్రవీణ్ కుమార్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ప్రవీణ్ కుమార్‌ వారానికి ఒకసారి ఆయన కొడుకుని కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు తీర్పు ఇచ్చినా అత్తామామలు మాత్రం తండ్రీకొడుకులు కలుసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఏడాదిన్నరగా తన కుమారుడిని చూసేందుకు ప్రవీణ్ అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ అత్తామామలు మాత్రం ప్రవీణ్ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. తండ్రీకొడుకులను అసలు కలవనీయడం లేదు. దీంతో చివరికి తన కుటుంబసభ్యులతో కలిసి ప్రవీణ్ కుమార్ అత్తారింటి ముందు ఆందోళనకు దిగాడు. తన కుమారుడిని చూపించాలని డిమాండ్ చేస్తున్నాడు. కుమారుడి కోసం ఇష్టంతో కొనుగోలు చేసిన బొమ్మలను ముందు పెట్టుకుని అత్తారింటి ముందు కొద్దిరోజులుగా నిరసన తెలుపుతున్నాడు. స్థానికులు ఇది చూసి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అల్లుడు అత్తారింటి ముందు ధర్నా చేయడం కాస్త ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పును అమలు చేయాలని, తన కొడుకుని అప్పగించాలని ప్రవీణ్ కోరుతున్నాడు. కానీ అత్తామామలు మాత్రం స్పందించడం లేదు. దీంతో కొద్దిరోజులుగా అల్లుడు ఇంటి ముందే కూర్చోని నిరసన తెలియజేస్తున్నాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10