రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉమ్మేతల అశోక్(30), అతని భార్య అంకిత ఆత్మహత్య చేసుకున్నారు. తాము చనిపోతే తమ చిన్నారి అనాధ అవుతుందని భావించారో ఏమో మూడు నెలల పసిపాపను తమతో పాటు తీసుకెళ్లారు. చిన్నారికి కూడా ఉరివేసి..ఆపై దంపతులు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అశోక్ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే కుటుంబ కలహాల వల్లే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.