పరీక్షా పత్రాలే కాదు.. కేసీఆర్ పాలనలో అన్నీ లీకులే అంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం, ధరణి పోర్టల్, డబెల్ బెడ్‌రూం ఇళ్లు, కట్టిన ఆనకట్టలు అన్నీ లీకేజీలే అంటూ ఎద్దెవా చేశారు. అటు కేసీఆర్ డిగ్రీ పట్టాలపై సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. వేల పుస్తకాలు చదివానంటున్న కేసీఆర్ అసలు డిగ్రీ ఏం చేశారో అ సర్టిఫికెట్లు బయటపెట్టాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం చెబుతూ విమర్శలు గుప్పించారు బండి సంజయ్.. ఇటీవల కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం వేల కోట్ల అక్రమాలకు పాల్పడి.. రాజకీయాలు చేయాలనుకుంటుందన్నారు.
ఏర్పాట్ల పరిశీలన..
కాగా.. అంతకుముందు సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పరిశీలించారు. బీజేపీ నాయకులు స్టేషన్ అంతా కలియతిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. నెలకోసారి వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ తెలంగాణకు ఇస్తున్నా, KTR పదేపదే విమర్శిస్తున్నారని ఆరోపించారు. MMTS రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని లక్ష్మణ్ అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ పనులు చేపడుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో, ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుందని అన్నారు.