కర్ణాటకలోని మొత్తం 224 శాసనసభ స్థానాలకు మే 10 పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో.. అక్కడ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీగా నగదు చేతులు మారే అవకాశం ఉన్నందున ఈసీ పట్టు బిగించింది. ప్రతి పార్టీ ప్రజలకు ఉచితాలు, బహుమతులు పంచి తమ ఓటు బ్యాంకును పెంచుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మార్చి 29న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి 316 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన అధికారులు… రూ.47.43 కోట్ల నగదు, విలువైన వస్తువులు, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తోన్న నగదు, విలువైన వస్తువులు, మద్యాన్ని ఐటీ, విజిలెన్స్, ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ సోమవారం వెల్లడించింది. రెండు వారాల కిందట రూ.58 కోట్ల నగదు, మద్యం, పలు గిఫ్ట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గత ఆరు రోజుల్లో రూ.12.82 కోట్ల నగదు, రూ.16.02 కోట్ల ఖరీదుచేసే 2.78 లక్షల లీటర్ల మద్యం, రూ.10.79 కోట్ల ఖరీదైన కానుకలు, రూ.6.72 కోట్ల విలువచేసే రూ.13.57 కిలోల బంగారం, రూ.64 లక్షల ఖరీదైన వ88.76 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ.41.26 లక్షల విలువచేసే 79.4 కిలోల డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఫ్లయింగ్ స్క్యాడ్స్, ఎస్ఎస్టీ, పోలీస్, ఐటీ అధికారుల ఆపరేషన్ కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో మరింత నగదు పట్టుబడే అవకాశం ఉంది.
స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, డ్రగ్స్‌కు సంబంధించి మొత్తం 316 ఎఫ్ఐఆర్‌లు నమోదయినట్టు తెలిపారు. అలాగే, 31 వేలకుపైగా ఆయుధాలను స్వాధీనం చేసుకుని, ఏడు తుపాకీ లైసెన్స్‌లను రద్దు చేశారు. ఆయా ఘటనల్లో 1,416 మందిప కేసు నమోదుచేసిన పోలీసులు.. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. భారీగా నగదు, మద్యం పట్టుబడుతుండటంతో సిబ్బందిని పెంచి స్క్వాడ్‌ల సంఖ్యను పెంచినట్లు సీఈవో వెంకటేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మే 10న పోలింగ్ నిర్వహించి, మే 13న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.