సిద్దిపేట: నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట రూరల్ మండలం చిన్నగుండవెళ్లిలో మంత్రి ఆదివారం పర్యటించారు. చిన్నగుండవెళ్లిలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో హరీష్ మాట్లాడుతూ..ఈ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలలో వరిసాగు చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే వరి సాగు అయ్యిందన్నారు. తెలంగాణ రాకముందు అక్కడి ప్రజలు జొన్న, మక్క గట్క తప్ప ఏమీ తినలేదని, తానే అన్నం తినడం నేర్పనని టీడీపీ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పండిన వారి ధాన్యం నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతుందని, రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ఆలోచనలతో అనేక సంక్షేమ పథకాలతో గొప్ప మార్పు వచ్చి అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షాలకు ఏమని విమర్శించాలో..అర్థం కాక సతమతమవుతున్నారని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు కోసం బడ్జెట్‌లో రూ. వెయ్యికోట్ల సబ్సిడీ కింద అందిస్తున్నామని చెప్పారు. రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగుచేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. రైతులకు మేలు చేకూర్చాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని హరీష్ అన్నారు.