వరంగల్ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రీతి మృతి కేసు విచారణ మరింత వేగవంతమైంది. నిందితుడు సైఫ్ ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు నేరాన్ని అంగీకరించారని వరంగల్ పోలీసులు తెలిపారు. కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు పోలీసుల విచారణలో సైఫ్ చెప్పినట్టు సమాచారం. తాను సీనియర్‌ని కనుక ప్రీతి వృత్తి రీత్యా పొరపాట్లు చేయడం వల్ల తప్పని చెప్పానే కానీ…అది ర్యాగింగ్ కాదని మొదట సైఫ్ వాదించాడు. ఫోన్‌లో వాట్సాప్ చాటింగ్ చూపించి విచారించడంతో సైఫ్ నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
కాగా.. ప్రీతి మృతి కేసులో వరంగల్ సీపీ రంగనాథ్ నేరుగా రంగంలోకి దిగారు. ఎంజీఎంలోని అనస్తీషియా విభాగం, ఆర్ఐసీయూ వార్డును సీపీ పరిశీలించారు. అందుబాటులో ఉన్న అనస్తీసియా సీనియర్ విద్యార్థులు, ప్రీతి సహచరులను విచారించారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్ ను కలిశారు. నిన్న ప్రీతి తల్లిదండ్రులను మంత్రి కేటీఆర్ కలిశారు. నిందితులు ఎవరైనా వదలొద్దని సీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రీతి తల్లిదండ్రుల ఎదుటే సీపీతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు.