హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోతూనే ఉంది. చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం రాజేంద్రనగర్‌లో పోలీసుల చేతికి డ్రగ్స్ చిక్కాయి. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ సంఘటన హిమాయత్ సాగర్ వద్ద చోటుచేసుకుంది. డ్రగ్స్ విక్రయిస్తుండగా రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి ఆడీ కారులో వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నాడు. విశ్వసనీయవర్గాల ద్వారా ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
నిందితుడి దగ్గర ఉన్న డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు ఓ కారు, రెండు మొబైల్ ఫోన్లు, క్రెడిట్ కార్డులు, 30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పాత బస్తీకి చెందిన మహ్మద్ హమీద్ ఆలీగా గుర్తించారు. నిందితుడిని ఎస్‌వోటీ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. రాజేంద్రనగర్ పోలీసులు నిందితుడిపై యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా పలు కీలక విషయాలు బయటపెట్టాడు. డ్రగ్స్ ముంబై నుండి హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా నిందితుడు తెలిపాడు. నిందితుడు వెనుక ఏదైనా ముఠా ఉందా? లేదా ఒక్కడే తీసుకొచ్చి అమ్ముతున్నాడా? అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.