కేంద్ర ప్రభుత్వం మహిళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని.. ఆ బిల్లు ఆమోదం తెలిపే వరకు తమ పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలని ఆమె ఆకాంక్షించారు. మహిళ రిజర్వేషన్ల బిల్లు కోసం భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత నిరాహార దీక్ష చేపట్టారు. 18 పార్టీలు సంఘీభావం తెలపడంతో పాటు.. ఆయా పార్టీలకు చెందిన నేతలు ఆమె దీక్షకు హాజరయ్యారు. బీఆర్ఎస్ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కవిత దీక్షకు హాజరయ్యారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా కవిత దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. భారత సంస్కృతిలో మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని.. 1996 లో దేవెగౌడ హయంలో బిల్లు పెట్టినా, ఇంకా చట్టం కాలేదని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారటీ ఉందని.. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని తెలిపారు.