చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో విజయం
చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 280 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా.. జడేజా ముగ్గురు బ్యాట్స్ మెన్లను పెవిలియన్ కు పంపించాడు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే చతికిలపడింది. రెండో ఇన్సింగ్స్ లో భారత జట్టు 287 పరుగులు చేసింది. దీంతో 515 పరుగుల భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
బంగ్లా బ్యాట్స్ మెన్ లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో ఒక్కడే కాస్త గట్టిగా పోరాడాడు. 82 పరుగులు సాధించాడు. అయితే, అశ్విన్ ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 234 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.