అమెరికాలోని కొలరాడో నదిపై 8 దశాబ్దాల క్రితం నిర్మించిన అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు హూవర్ డ్యామ్ ఎంతో ఆదర్శవంతమైందని, ఇక్కడి నీటి వినియోగం, అమలవుతున్న రక్షణ చర్యలు ఆచరించదగినవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన రాష్ట్ర బృందంలోని ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ బలరామ్, స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ ఇంకా ఇతర అధికారులతో కలిసి హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. ఫెడరల్ గవర్నమెంట్ అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను వివరించారు.
1931 – 36 మధ్య నిర్మించిన ఈ ఆర్క్ గ్రావిటీ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతమని, ఇక్కడ ఉన్న 17 జనరేటర్ల ద్వారా 2080 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా మూడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని అధికారులు వివరించారు. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఉన్న 80 లక్షల మంది ప్రజల మంచినీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలు కూడా హూవర్ డ్యామ్ తీరుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అక్కడ జరుగుతున్న జల విద్యుత్తు ఉత్పాదకత, యంత్రాల సామర్థ్యం, నీటి లభ్యత, అడుగడుగునా ఏర్పాటు చేసిన రక్షణ చర్యలు, ఇంకా ఇతర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో గల జల విద్యుత్ ప్రాజెక్టుల సమాచారంతో బేరీజు వేస్తూ హువర్ డ్యామ్ జల విద్యుత్ ఉత్పాదకతను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదలకు, రక్షణ మెరుగుదలకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారులను కోరారు.
ఈ సందర్భంగా 1931 నుండి 35 మధ్య జరిగిన డ్యామ్ నిర్మాణ దృశ్యాలను, ఫోటోలను డ్యామ్ అధికారులు ప్రదర్శించారు. మరోవైపు, మైనెక్స్ 2024 అంతర్జాతీయ ప్రదర్శనలో భట్టి పాల్గొన్నారు. వివిధ ప్రఖ్యాత కంపెనీల స్టాల్స్‌ను సందర్శించారు. శాండ్విక్ కంపెనీ స్టాల్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని పరిశీలించారు. అనంతరం అదే స్టాల్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు. సింగరేణి కార్మికుల రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా సాంకేతికతను ప్రస్తుత గనుల్లో, భవిష్యత్ గనుల్లో ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని బృందంలో ఉన్న సింగరేణి సిఎండీ బలరామ్‌కు సూచించారు.