కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలోని మహిళా హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. స్టూడెంట్స్ వీడియోలు తీసి వాటిని వైరల్ చేసి విక్రయిస్తున్నారని గురువారం రాత్రి నుంచి మీడియా, సోషల్ మీడియాలో వస్తు్న్న వార్తలు, ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. విద్యార్థుల నిరసనలు, ఆందోళనలు.. ప్రభుత్వం సీరియస్ కావడం.. ముఖ్యమంత్రి సహా మంత్రులు స్పందించడం.. ఇక సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలతో శుక్రవారం రాష్ట్రంలో ఇదే పెద్ద వార్తగా మారింది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన అధికారులు.. ఆ కాలేజీలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఏమీ దొరక్కపోవడంతో అంతా శాంతించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోలీసులు గుడ్లవల్లేరు ఘటనపై విచారణ వేగవంతం చేశారు. కళాశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థినుల సమక్షంలోనే లేడీస్ హాస్టల్ మొత్తం తనిఖీలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ డివైస్‌లను గుర్తించే మరో పరికరంతో హాస్టల్‌లో అణువణువూ గాలింపు చేపట్టారు. అందరి సమక్షంలోనే దాదాపు 4 గంటలకుపైగా పోలీసులు తనిఖీలు చేశారు. చివరికి ఎలాంటి రహస్య కెమెరా లభించలేదు. అయితే అందరి సమక్షంలోనే తనిఖీలు జరగ్గా.. అందులో ఎలాంటి కెమెరాలు దొరక్కపోవడంతో విద్యార్థినులు సంతృప్తి చెందారు. అనంతరం గురువారం రాత్రి నుంచి చేస్తున్న ఆందోళనలకు తెరదించారు. ఈ నేపథ్యంలోనే ఇంజినీరింగ్ కాలేజీకి సోమవారం వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపింది. మరోమారు తనిఖీలు చేపడతామని స్పష్టం చేసింది.