AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎకో టూరిజం పాలసీ తెస్తున్నాం : మంత్రి కొండా సురేఖ

పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా, స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అటవీశాఖకు లబ్ధి చేకూరేలా ఎకో టూరిజం పాలసీని ఖరారు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. పాలసీ రూపకల్పనలో భాగంగా పలు శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి, రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించే దిశగా సమర్థవంతమైన ఎకో టూరిజం పాలసీని తెస్తున్నామన్నారు. టెంపుల్ టూరిజంకు ప్రాధాన్యతనిచ్చినట్లుగానే, ఎకో టూరిజంలో భాగంగా వాటర్ టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

ఈ దిశగా 30 నుంచి 40 సైట్లను గుర్తించినట్లు అధికారులు మంత్రికి వివరించగా, అటవీశాఖ పరిధిలో ఉన్న పర్యావరణహిత అనుకూలత కలిగిన సైట్లను ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. కర్ణాటక, ఒడిశాలో అమలు చేస్తున్న ఎకో టూరిజం పాలసీలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ రెండు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పాలసీలకు మధ్యస్థంగా తెలంగాణ ప్రాంత పరిస్థితులకు అనువైన పాలసీని రూపొందించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. పీపీపీ పద్ధతిలో కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. ఈ దిశగా ఎన్ఆర్ఐల సహకారం తీసుకోవాలన్నారు. స్థానికులకు ఉపాధిని పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పర్యాటకులకు ఎకో టూరిజం స్పాట్ల సమస్త సమాచారం, ఆన్‌లైన్‌ బుకింగ్ సదుపాయం కల్పిచేలా యాప్, వెబ్‌సైట్స్‌ను రూపొందించాలని అధికారులకు సూచించారు.

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు టూరిజం స్పాట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఎకో టూరిజం పాలసీ రూపకల్పను దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరో సమావేశం నాటికి ఎకో టూరిజం పాలసీకి స్పష్టమైన రూపాన్నివ్వాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10