హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అదనపు ఎస్పీ రవి చందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు ఫైల్ అయింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఏఎస్పీ రవి చందన్ కంప్లైంట్ ఇచ్చారు. తాను విధులు నిర్వర్తిస్తుండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన రాయదుర్గం పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్ 132, 351(3) ప్రకారం కేసు నమోదు చేశారు.
రెండు రోజులుగా రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హైటెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్‌లో చాలెంజ్‌లు, కౌంటర్ చాలెంజ్‌లు విసురుకోవడమే కాదు.. ఈ రోజు దాదాపు భౌతిక దాడుల వరకు పరిస్థితులు వెళ్లాయి. తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని అరికెపూడి గాంధీ ముందు రోజు స్పష్టం చేశారు. కానీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఆయన వ్యాఖ్యలను విశ్వసించక ఆయనకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతానని, గురువారం ఉదయం 11 గంటలకు ఆయన నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురేస్తానని చెప్పారు. ఈ సవాల్‌పై అరికెపూడి గాంధీ ఫైర్ అయ్యారు.
ఈ వ్యవహారంతో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంకా ఇతర నేతలు అంతా కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు వెళ్లారు. తనపై హత్యాయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డి. అయితే, సైబరాబాద్ కమిషనరేట్ వద్ద పోలీసులపై దౌర్జన్యానికి దిగారు ఆయన. ఎమ్మెల్యేలను మాత్రమే లోనికి అనుమతిస్తామని పోలీసులు చెప్పటంతో కౌశిక్ రెడ్డి
వారికి వేలు చూపిస్తూ రెచ్చిపోయారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని నెట్టేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. హరీష్ రావు వారించబోయినా పట్టించుకోకుండా పోలీసులపై జులుం ప్రదర్శించారు. కౌశిక్ రెడ్డి వ్యవహర శైలిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ ఘటన పైనే పోలీసు అధికారి ఫిర్యాదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.