బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నే భూపాలపల్లి కోర్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు నోటీసులు పంపింది. వచ్చే నెల 5వ తేదీన కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ పీఎస్‌లో ఈ కేసు ఫైల్ అయింది. గత నెల 29వ తేదీన 778/2024 ఎఫ్ఐఆర్ పేరుతో ఈ కేసు నమోదైంది.
మేడిగడ్డ బ్యారేజీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గత నెల 26వ తేదీన మధ్యాహ్నం పూట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆయనతోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన గండ్ర వెంకటరమణా రెడ్డి, బాల్క సుమన్, కార్యకర్తలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు, మరికొందరు కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఇక్కడ డ్రోన్ విజువల్స్‌ను వారు చిత్రీకరించారు. ఈ విషయం తమకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు.
ఈ విషయాన్ని తాను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, ఈ మేడిగడ్డ బ్యారేజ్ తెలంగాణకు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, కాబట్టి ఇలాంటి చర్యల వలన బ్యారేజీకి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని చెప్పినట్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. కాబట్టి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతులు తీసుకోకుండా డ్రోన్ ఎగరవేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని పోలీసులకు ఫిర్యాదు కాపీలో విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించారు. కేసు నమోదు చేశారు.