సీఎం రేవంత్ తప్పుల చిట్టా రాస్తున్నానని.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం బీజేపీ వర్క్ షాప్‌లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. బీజేపీ కార్యకర్తలను ఉత్తేజపరిచే కామెంట్స్ చేశారు. బీజేపీకి ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు ఒకరు తెలంగాణ నుంచి గెలిచారని.. మరొకరు గుజరాత్ నుంచి గెలిచారన్నారు. గుజరాత్‌లో పార్టీ అధికారంలోకి వచ్చిందని.. మరి తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామని అన్నారు.
46 ఏళ్ల తరువాత తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచామన్నారు ఈటల. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు షేర్ తేడా కేవలం 4 శాతం మాత్రమే అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో పెట్టిన ఎఫర్ట్ పెట్టాలని పార్టీ శ్రేణులకు ఈటల రాజేందర్ సూచించారు. అన్ని లోకల్ బాడీ ఎన్నికలకు ప్రాధాన్యత గుర్తించాలన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఛీ అనిపించుకోవడానికి ఆరేళ్ళు పట్టిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో ఛీ కొట్టించుకోవడానికి 9నెలలు కూడా పట్టలేదని ఈటల వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్న వారికి N కన్వెన్షన్ మాత్రమే కనిపిస్తుందన్నారు. హస్మత్ చెరువు కింద 120 మంది పేదలకు నోటీసులు ఇచ్చారన్నారు. ఫిరంగి నాల ముసుకుపోయిందన్నారు. పేదల ఇండ్లు కులగొట్టడం మీతరం కాదని.. పేదల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఈటల హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేలిపోవడం ఖాయం అన్నారు.