ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌకగా పిలుచుకునే గద్దర్ అమరుడై ఏడాది గడిచింది. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో స్థాపించిన గద్దర్ ఫౌండేషన్ ఆధ్వరంలో మంగళవారం రవీంద్ర భారతిలో ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. గద్దరన్న యాదిలో పేరుతో సాగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, సీపీఐ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మేధావులు, సాహితీరంగ ప్రముఖులు, వామపక్ష, హక్కుల సంఘాల ప్రతినిధులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ చిత్రపటానికి మాలలు వేసి నివాళులు అర్పించారు. నాలుగేళ్ల అజ్ఞాతంలో గద్దర్ రాసిన పుస్తకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఇందులో మధు యాష్కి, వివేక్, కూనంనేని, నారాయణ, జూలకంటి, అద్దంకి, విమలక్క తదితరులు పాల్గొన్నారు.
గద్దర్ గొప్ప తాత్వికుడు, వాగ్గేయకారుడు, విప్లవకారుడని అల్లం నారాయణ అన్నారు. నక్సల్బరీ ఉద్యమానికి జీవితాన్ని ధారపోశాడని, ఉద్యమం నుంచి బయటికి వచ్చినా విప్లవ స్ఫూర్తితోనే కొనసాగారని వివరించారు.
నక్సల్బరీ ఉద్యమం నుంచి శ్రీకాకుళం, జగిత్యాల పోరాటాల వరకు గద్దర్ ప్రస్థానం అద్భుతంగా సాగిందని, రెండు మూడు సంవత్సరాల జీవితాన్ని తీసుకుని విమర్శించడం కుసంస్కారం అని హక్కుల నేత చిక్కుడు ప్రభాకర్ అన్నారు.
ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి సారధిగా గద్దర్ నిలబడ్డారని, జై తెలంగాణ అన్నందుకు భువనగిరిలో బెల్లి లలితక్కను ముక్కలుగా నరికినప్పుడు ధైర్యంగా అక్కడికి వచ్చిన ధీశాలి గద్దర్ అని రచయిత నందిని శిధా రెడ్డి వివరించారు. గద్దర్ ప్రయాణంలో అందరూ కలిసి ముందుకు నడవాల్సిన అవసరముందన్నారు.
దండకారణ్యంలో ఆదివాసీలను ఎన్‌కౌంటర్ పేరిట పొట్టనబెట్టుకుంటున్నారని, వారికోసం వేసిన ఆదివాసీల హక్కుల పోరాట సంఘీభావ కమిటీ వేశామని, గద్దరన్న ఉంటే ఈ కమిటీ బాధ్యత వహించేవారని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు.
గద్దర్ ఒక లెజెండ్ అని, తాను చేయాలనుకున్న పనులన్నీ గద్దర్ చేశాడని సినీ నిర్మాత నర్సింగారావు అన్నారు. తన ప్రొడక్షన్ సంస్థ మూసేసే ప్రమాదంలో ఉన్నప్పుడు తనను రక్షించిన రక్షకుడు గద్దర్ అని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మధు యాష్కిగౌడ్, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.