జనగాం ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనకు చెందిన అనురాగ్ యూనివర్సిటీని ఘట్కేసర్ నాదం చెరువు సమీపంలో నిర్మించారని, దీనిని కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమవుతోందంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్ట్.. అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లును పరిశీలించాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది.
యూనివర్సిటీ బఫర్ జోన్‌లో ఉందా, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందా అనేది తేల్చాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనకు లోబడి పని చేయాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు ముగించింది. కాగా అనురాగ్ యూనివర్సిటీని ఘట్కేసర్ నాదం చెరువు సమీపంలో నిర్మించారని గతంలో రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు గుర్తించారు. యూనివర్సిటీని శిఖం భూముల్లోనే నిర్మించారని ప్రభుత్వ చెబుతోంది. దీంతో అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.