హైడ్రా లక్ష్యాలు ఏంటో వివరించే ప్రయత్నం చేశారు కమిషనర్ రంగనాథ్. ఈ సందర్భంగా హైడ్రాపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపైనా క్లారిటీ ఇచ్చారు. హైడ్రా ఏర్పాటుకు గల కారణాలేంటో వివరించారు. హైకోర్టు వ్యాఖ్యల తర్వాత రంగనాథ్ పేరుతో హైడ్రా చేసిన ట్వీట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు రంగనాథ్. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదని స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదన్న ఆయన, సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని తెలిపారు. దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని వివరించారు.
హైడ్రాకు కూల్చివేతలు కాదు చెరువుల పునరుద్ధరణే లక్ష్యమన్నారు కమిషనర్. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే ఉందన్న ఆయన, నగరంలోనే కాదు, రాష్ట్రంలో, ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాల్లో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టడం హైడ్రా పనులుగా పేర్కొన్నారు.