భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితుల అండగా నిలవాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ముందుకు వచ్చారు. బాధితులకు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 10 లక్షల రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్లకు ఎన్వీ రమణ దంపతులు చెక్కులను అందజేశారు. వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కష్టాలు తనను కలచివేశాయని, వరద బాధితులకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మాజీ సీజేఐ ఎన్వీ రమణ.
అకాల వరదలతో పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు ఎన్వీ రమణ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇటి వంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేయాలని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.