గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు సీఎం రేవంత్ రెడ్డి.. స్పెషల్ గిఫ్ట్ ప్రకటించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరించెందుకే సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా.. పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు స్వయంగా విద్యుత్ అధికారులు వారికి ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. చిత్తశుద్ధి, నిబద్దతతో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించాలని సూచించారు. నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరమన్నారు. ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలన్నారు. వీవీఐపీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అదేశించారు.