వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఊరూవాడా గణనాథుని మండపాలు వెలిశాయి. చవితిని పురస్కరించుకుని వివిధ రకాల గణపయ్యలు భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా గణపతిని తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంటారు. అదే విధంగా చిత్తూరులో (Chittoor) ప్రసిద్ద పుణ్యక్షేత్రం కాణిపాకంలో (Kanipakam Temple) వెలిసిన గణపయ్య విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా మట్టితో గణపయ్యను తయారు చేస్తుంటారు. మట్టితోనే ఎన్నో ప్రత్యేకమైన ప్రతిమలను చేస్తుంటారు. లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న వాటిని హైలెట్ చేస్తూ కూడా వినాయకుడిని రెడీ చేస్తుంటారు. కానీ చిత్తూరులో గణపయ్య మాత్రం వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు.
వినాయక చవితి సందర్భంగా జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుని దేవాలయంలో దొండకాయలు మరియు పూలతో వినాయకుని ప్రతిమను నిర్వాహకులు తయారు చేశారు. ఈ రెండు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుమారు మూడు కేజీల దొండకాయలు ఈ ప్రతిమ నిర్వహణకు ఉపయోగించినట్లు తెలుస్తుంది. కాణిపాకానికి విచ్చేస్తున్న భక్తులు దొండకాయలు, పూలతో చేసిన వినాయక ప్రతిమలను చూసి ఆశ్చర్యచకితువుతున్నారు. జైబోలో గణేష్ మహరాజ్‌కి జై అంటూ ఆలయంలో భక్తులు నినాదాలు చేస్తున్నారు.