మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శివాజీ విగ్రహం కూలడంతో బాధపడిన మహారాష్ట్ర ప్రజలకు తాను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. పాల్ఘర్ జిల్లాలోని మల్వన్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై తాను క్షమాపణలు చెబుతున్నా ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పడం లేదని ప్రధాని విమర్శించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంలా కొలిచే వారంతా విగ్రహం కూలిన ఘటనలో ఎంతో బాధపడ్డారని, వారందరికీ తాను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ గడ్డ బిడ్డ వీర్ సావర్కర్‌ను అవమానిస్తున్నారని విపక్షాలపై ప్రధాని విరుచుకుపడ్డారు. వీర్ సావర్కర్‌ను తూలనాడినా, శివాజీ మహరాజ్ విగ్రహం నేలకూలినా వారు విచారం వ్యక్తం చేయరని వ్యాఖ్యానించారు.
క్షమాపణలు చెప్పరని, వారు కోర్టులకు వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉంటారని ఆరోపించారు. ఇక అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పాల్ఘర్‌లో వధ్వాన్ పోర్టుకు శంకుస్ధాపన చేశారు. రూ. 76,000 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఇక రూ. 1560 కోట్ల విలువైన ఫిషరీస్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.