భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్షాలు, వరదలపై ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల ఇళ్లు కూలిపోయిన, దెబ్బతిన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇళ్లు కూలిపోయిన ప్రతి కుటుంబానికి 16 వేల 500 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 33 మంది మరణించారు.
ఇక.. వర్షాలతో పంట నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పారాయన. నష్టపోయిన ప్రతి ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామన్నారు. వర్షాల తడిచిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని వెల్లడించారు మంత్రి. వరదల వల్ల ధ్వంసమైన రహదారులకు యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపడతామని చెప్పారు. మరోవైపు.. వరదల్లో సర్టిఫికెట్లను కోల్పోయినవారు ఆందోళన చెందవద్దని.. ప్రతి పోలీస్ స్టేషన్ లో వారు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతిఒక్క బాధితుడికి సహాయం అందిస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్.
కాగా.. భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ప్రజలను భయపెడుతోంది. గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ములుగు జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరికి వరద పోటెత్తుతోంది. టేకులగూడెం జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో.. ఛత్తీస్ గఢ్ – తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ఛత్తీస్ గఢ్ వైపు వెళ్లే వాహనాలను పరకాల, భూపాలపల్లి, మహదేవ్ పూర్ మీదుగా దారి మళ్లిస్తున్నారు. తాలిపేరుకు వరద పోటెత్తడంతో అధికారులు వచ్చిన వరదనీటిని గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.