గానగంధర్వుడు, దివంగత మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గౌరవిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నగరంలోని ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టింది.
ఎస్పీ బాలు చెన్నైలో నుంగంబాక్కం ఏరియాలో నివసించేవారు. ఇప్పుడు నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు బాలు పేరు పెట్టారు. కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
ఎస్పీ బాలు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠా భాషల్లో కూడా పాటలు పాడారు. 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు కూడా అందుకున్నారు. కేంద్రం ఆయనకు 2001లో పద్మ శ్రీ, 2011లో పద్మ భూషణ్, 2021లో పద్మ విభూషణ్ అందించింది.