AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంగనాకు బుద్ధిరాలేదు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఫైర్‌

సీఆర్పీఎఫ్‌ అధికారి చెంప దెబ్బ కొట్టినా మారలేదు
అంబర్‌పేట పీఎస్‌లో కేసు నమోదు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ పై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి. హనుమంత రావు మండిపడ్డారు. సంబంధంలేని అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కంగనాపై అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం వీహెచ్‌ మాట్లాడుతూ పాపులారిటీ కావడం కోసమే కంగనా.. రాహుల్‌పై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. ఆమె ఏ విషయమైనా పార్లమెంట్‌లో మాట్లాడాలని సూచించారు. రాహుల్‌కి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. రాహుల్‌తోపాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలందరినీ ఆమె అవమానించిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలపైన అనేక ఆరోపణలు చేస్తున్నారని, మహిళ సీఆర్పీఎఫ్‌ అధికారి చెంప దెబ్బ కొట్టినా కూడా తనలో మార్పు రాలేదన్నారు వీహెచ్‌.

లోక్‌ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీకి డ్రగ్స్‌ అలవాటు ఉందనే ఆరోపణలు చేయడం సమంజసం కాదని, ఆయన చెత్త ప్రసంగాలు చేస్తాడని కామెంట్‌ చేయడం పట్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు వీహెచ్‌. కంగనా మీద హైదరాబాద్‌ లోని అంబర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేశామని, ఈ లాంటి వాళ్ళను బీజేపీ ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడి తరిమికొడతారన్నారు వీహెచ్‌.
హైడ్రా గుడ్‌ వర్క్‌..
హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు ఇతర జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా రేవంత్‌ సర్కార్‌ తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ భేష్‌ అని వీహెచ్‌ పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. అయితే ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చాల్సి వస్తే.. వారికి వేరే చోట డబల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరారు. సీఎం రేవంత్‌ తన కుటుంబ సభ్యుల ఆక్రమణలు ఉన్నాయని తేలినా.. కూల్చేయాలని చెప్పడం మంచి విషయమని వీహెచ్‌ అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10