పేదలకు పంచాల్సిందే
– తండ్రీకొడుకులది బ్లాక్‌మెయిల్ చరిత్ర
– రూ. వేల కోట్లు పార్టీ ఫండ్ కింద జమచేసిండ్రు
– మూసీ నిర్వాసితులకు నా డబ్బంతా ఇస్తా.. మీరు సిద్ధమా అంటూ సవాల్
– హరీశ్‌రావు భూముల నుంచి ట్రిపుల్ ఆర్ వెళ్లాల్సిందే
– అవసరమైతే సీఎం ఇంటి ఎదుట ధర్నాకు దిగుతా
– బీఆర్‌ఎస్‌పై మైనంపల్లి హనుమంతరావు సంచలన ఆరోపణలు
(అమ్మన్యూస్, సిద్దిపేట జిల్లా):
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎస్ నేతలపై మరోసారి ఫైర్ అయ్యారు. మాజీముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ రూవేల కోట్లు దండుకున్నారని, అదంవతా కక్కిస్తామని అన్నారు. అలాగే మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపైనా మరోసారి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడవగా.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని మల్లన్న సాగర్ ముంపు బాధితులను కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి ఆయన సంచలన కామెంట్స్ చేశారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్ట్ నుంచి హరీశ్ భూములు తప్పించారని ఆరోపించారు. షాద్‌నగర్ ప్రాంతంలో హరీష్ రావుకు భూములున్నాయని.. రెండు రోజుల్లో ఆ భూముల దగ్గరకు వెళ్తానని చెప్పారు. హరీశ్ భూముల్లో నుంచి వెళ్లకపోతే.. సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తానని కీలక కామెంట్స్ చేశారు.
మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం..
ఇక మూసీ ఆక్రమణలపై స్పందించిన మైనంపల్లి.. మూసీ పక్కన ఉన్న పేదవాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదారాబాద్‌లో అక్రమ కట్టడాలు కడితే నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ఆనాడు కేసీఆరే అన్నారని గుర్తు చేశారు. మూసీ నది క్లీన్ చేయడం వల్ల ఎంతో లాభం ఉంటుందని చెప్పారు. కూల్చివేతలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు అవసరమయితే తన డబ్బు, తన భార్య పేరున ఉన్న డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అందుకు కేసీఆర్, హరీష్ సిద్ధమా అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ది బ్లాక్ మెయిల్ చరిత్ర
‘కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. వేల కోట్లు కేవలం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలకు వాడారు. హరీష్ రెండ్రోజుల్లో నీ ఫాంహౌస్‌కు వస్తున్నా. చెరువులోనే నీ ఫాంహౌస్‌ను కట్టుకున్నావ్. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ల్యాండ్ గ్లాబరులుగా ఉన్నారు. హైడ్రా విషయంలో బీజేపీతో సహా అన్ని పార్టీలు సహకరించాలి. విజయవాడ మాదిరిగా హైదారాబాద్ కాకూడదు. కేసీఆర్ ఫాం హౌస్ నుంచి షాద్‌నగర్ వద్ద హరీష్‌కు ఉన్న 70 ఎకరాల నుంచి ట్రిపుల్ ఆర్ రోడ్డు పోవాల్సిందే నంటూ మైనంపల్లి స్పష్టం చేశారు.
ఇష్టారీతిన అనుమతులు ఇచ్చారు…
‘చెరువులు అన్ని కబ్జా అయితే వర్షం వస్తే నీళ్లు ఎక్కడికి వెళ్లాలి. ఇష్టారీతిన అనుమతులు ఇచ్చి హరీష్‌రావు, కేటీఆర్‌లు లక్షల కోట్లు ఆక్రమించారు. తెలంగాణను అప్పుల పాలు చేసి కేసీఆర్ కుటుంబం తెలంగాణను మొత్తం దోచుకుంది. తెలంగాణ ప్రజలందరి మీద ఒక్కొక్కరికి లక్షన్నర చొప్పున అప్పులు చేసి పెట్టారు. రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలనేది రేవంత్ లక్ష్యం. లక్షలాది మంది చనిపోతే తక్కువగా చేసి చూపించిన ఘనత మీది. కేసీఆర్, హరీష్‌రావు దమ్ముంటే మీ డబ్బులు పేదలకు పంచి ఇవ్వాలి, నేను నా ఆస్తులు ఇస్తా. మీ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో ఇక ఉండేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. బీఆర్‌ఎస్ పని అయిపోయింది. హైడ్రా వల్ల 10 నుంచి 15 శాతం నష్ట పోవచ్చు కానీ వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. బీజేపీ పార్టీ కూడా హైడ్రా విషయంలో సహకరించాలి, అవసరమైతే మీరు కూడా సాయం చేయాలి. ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. హైడ్రా పరిస్థితి ఒక కొలిక్కి వచ్చాక మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం’’ అని మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు.