బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ గురువారం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని కార్డియాలజిస్టులు లాలూ కుటుంబ సభ్యులకు సూచించారు. ఇందుకు వారు అంగీకరించడంతో ఇవాళ వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు.
కొంతకాలంగా లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఇందుకోసం ఆయన కుమార్తె కిడ్నీ దానం చేశారు. లాలూ అధికారంలో ఉన్నప్పుడు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ ఫర్ స్కామ్, దాణా కుంభకోణం కేసుల్లో ఆయన చాలారోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చారు. జైల్లో ఉన్నప్పుడు ఆయన తరచూ అనారోగ్యానికి గురయ్యేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుదీర్ఘకాలంపాటు అందులోనే ఉండటంతో ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఆ తరువాత నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించసాగారు.
త్వరలో డిశ్చార్జ్..
తీవ్ర అస్వస్థతకు గురైన లాలూ యాదవ్‌ను ఈ నెల 10న ఆయన ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. యాంజియోప్లాస్టీ చేసిన అనంతరం మరో రెండ్రోజులపాటు ఆయన వైద్యుల సంరక్షణలోనే ఉండాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 2014లో లాలూకు ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లోనే అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి వరుసగా ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు లాలూ.