పాట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 2న బీహార్‌లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, నాయకత్వంతో సహా అన్ని వివరాలు ఆ రోజు వెల్లడిస్తానని చెప్పారు. ‘జన సురాజ్’ పేరుతో బీహార్‌లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ అక్టోబరు 2న కొత్త పార్టీ ‘జన సూరజ్’తోపాటు నాయకత్వ ప్రకటన గురించి మీరు తెలుసుకుంటారు. నేను నాయకుడిని కాదు. నాయకుడు కావాలని ఎప్పుడూ ఆశించలేదు. అక్టోబర్ 2న ఏర్పాటవుతున్న ఈ పార్టీకి నేనెప్పుడూ నాయకుడిగా ఉండను. ప్రజలు నాయకత్వ పాత్ర పోషించాల్సిన సమయం ఇది’ అని అన్నారు.
కాగా, 2022 అక్టోబర్ 2న చేపట్టిన ‘జన సూరాజ్’ పాద యాత్ర మొదటి దశలో భాగంగా బీహార్‌లో 60 శాతం ప్రాంతాలను పూర్తి చేసినట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈ యాత్రకు నిర్ణీత రోజులు లేదా కిలోమీటర్ల సంఖ్య లేదన్నారు. ప్రధానంగా మూడు ఉద్దేశాలు నెరవేర్చడం కోసం బీహార్‌లోని ప్రతి మూలకు వెళ్లాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత కూడా తన పాదయాత్ర ఆగదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. మరో ఏడాది లేదా రెండేళ్ల వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీహార్ సవాళ్లకు పరిష్కారాలతో రెండో దశ యాత్ర ప్రణాళికను 2025 ఫిబ్రవరి లేదా మార్చిలో వెల్లడిస్తానని అన్నారు.