AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఖాళీ.. ఎన్సీపీలో విలీనం! .. – నేడు శరద్‌ పవార్‌తో కీలక చర్చలు

– మూకుమ్మడిగా ఎన్సీపీలో చేరనున్న మహారాష్ట్ర నేతలు
– గులాబీ బాస్‌కు బిగ్‌ షాక్‌

(అమ్మన్యూస్, ముంబయి):
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కు మహారాష్ట్ర పార్టీ నేతలు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. మహారాష్ట్రలోని బీఆర్‌ఎస్‌ పార్టీ.. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కాబోతుందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా… రాష్ట్ర బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మానిక్‌ రావ్‌ సహా పార్టీ నేతలు బుధవారం ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ ను కలవనున్నారు. అంతేగాక అక్టోబర్‌ 6న పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలంతా ఎన్సీపీలో చేరనున్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్సీపీతో బీఆర్‌ఎస్‌ నేతల మంతనాలు పూర్తి అయ్యాయని, చేరిక మాత్రమే మిగిలి ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని..
కాగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చారు. అనంతరం ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. కీలక నేతలను పార్టీలో జాయిన్‌ చేసుకుంటూ పార్టీని విస్తృతపరిచే ప్రయత్నం చేశారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటి, పార్లమెంట్‌ ఎన్నికల్లో తన మార్క్‌ ను నిరూపించుకోవాలని భావించారు. కానీ సొంత రాష్ట్రంలో ఘోర పరాజయం పాలవడంతో పార్టీ కార్యక్రమాలకే గాక కేడర్‌ కు సైతం పూర్తిగా దూరమయ్యారు.

ఇక పార్టీ అధినేత సైలెంట్‌ అవ్వడంతో ఆయా రాష్ట్రాల్లోని బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఏపీలో పార్టీ శాఖ అధ్యక్షుడు మినహా కీలక నేతలంగా ఎన్నికల సమయంలో ఎవరి దారి వారు చూసుకోగా.. ఇప్పుడు మహారాష్ట్ర శాఖ కూడా ఖాళీ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌ లోని చాలా మంది నేతలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌ గా మార్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని అధినేతకు సలహాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లోని పార్టీ శాఖలు ఖాళీ అవుతుండటంతో గులాబీ బాస్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10