హైడ్రాపై ప్రజలెవరూ పుకార్లు నమ్మెుద్దని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసమే హైడ్రా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని మంత్రి చెప్పారు. గతంలో భారీ వర్షాలకు హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తి, ప్రజలు నానా అవస్థలు పడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. కొందరు నేతలు స్వప్రయోజనాల కోసం, ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. సిద్దిపేటలో ఓ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..”హైడ్రా విషయంలో తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా పుకార్లు నమ్మెుద్దు. తెలంగాణకి హైదారాబాద్ గుండెకాయ లాంటిది. హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కృష్ణ, గోదావరి జలాలను హైదారాబాద్ ప్రజలకు తాగునీరుగా ఇచ్చిన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వానిదే. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వర్షాలు వస్తే నగరంలో నాళాలు మునిగి ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అందుకే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రావొద్దని రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఈ మేరకే హైడ్రాను తీసుకొచ్చాం. మూసీ, లెక్ సిటీ డెవలప్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం.
వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..
మూసీ కాల్వకు ఇరువైపులా నివాసం ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి ప్రచారాలు సరికాదు, వాటిని ప్రజలు నమ్మెుద్దు. మూసీ బాధితులకు ప్రత్యమ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇచ్చి ఆదుకుంటాం. మూసీ బాధితుల విషయంలో ప్రతిపక్షాలు, హరీశ్ రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మూసీ ప్రాంతాన్ని మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. గత ప్రభుత్వంలో మేము ప్రతిపక్షంలో ఉన్నపుడు సమస్యలపై మాకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదు.
రెచ్చగొట్టే ప్రయత్నాలు..
గత ప్రభుత్వంలో అనేక మంది నిర్వాసితులను లాఠీలతో అణచివేశారు. మేము బాధితులను సమన్వయ పరుస్తున్నాం. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మూసీ నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు అడుకోవద్దు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను స్వాగతిస్తున్నారు. కానీ కొంతమంది మూసీ బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే కాలంలో అన్ని చెరువులను రక్షిస్తాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారా పరిష్కారం చేస్తాం. ఎలాంటి ఇబ్బందులూ లేని ప్రజా జీవనం కోసమే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు” అని తెలిపారు.