తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తనకు న్యాయవ్యవస్థలపై అపార నమ్మకం ఉందని, తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుప్రీం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత్ బెయిల్‌పై సీఎం రేవంత్ చేసిన వాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తాము నిందితులకు బెయిల్ మంజూరు చేస్తామా అంటూ సీఎం రేవంత్ రెడ్డి తరపు లాయర్లను జస్టిస్ గవాయి నేతత్వంలోని తిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కవిత బెయిల్ పిటిషన్ అంశంలో రేవంత్ చేసిన కామెంట్స్ తాము వార్త పత్రికల్లో చదివామని చెప్పారు. సుప్రీం కోర్టు పట్ల గౌరవంగా మెలగాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని అసహనం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉండి న్యాయ వ్యవస్థలనే ప్రశ్నిస్తారా? అని న్యాయమూర్తులు గవాయి, విశ్వనాథన్ మండిపడ్డారు.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం, అపారమైన గౌరవం ఉందన్నారు. తాను కవిత బెయిల్ పిటిషన్‌పై చేసిన కామెంట్లను న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్లు కొన్ని పత్రికలు ఆపాదించాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియపై తనకు అత్యంత విశ్వాసం ఉందని అన్నారు. న్యాయవ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా తనకు నమ్మకం ఉందని చెప్పారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను.. ఎన్నటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని రేవంత్ ట్వీట్ చేశారు.