మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బీఆర్ఎస్ సోషల్ మీడియా దిగజారి వ్యవహరిస్తుంది. మహిళా మంత్రులపై అంత దారుణంగా ట్రోలింగ్ చేస్తుంటే కేటీఆర్, హరీష్ రావు హెచ్చరించరా? ఆ పోస్టులను చూసి రాష్ట్రంలో ఉన్న పద్మశాలి గుండెలు బాధపడుతున్నాయి. ఉద్యమాలు చేసి మంత్రిగా ఎదిగిన ఒక పద్మశాలి బిడ్డను ఇంతలా అవమానుపరుస్తారా..? ఈ విధంగా పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్.. ఎస్సీ, ఎస్టీ, బీసీలం కన్నెర్ర చేస్తే ఉంటుందా? కేటీఆర్ స్థానంలో నేను ఉంటే వెంటనే క్షమాపణ చెప్పేవాడిని. రాజకీయంగా విమర్శ చేయాలి.. తప్పులేదు కానీ, ఒక బీసీ ఆడ బిడ్డను ఈ విధంగా అవమానపరుస్తారా? అది ఎంతవరకు కరెక్టు?
కవిత లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయితే కాంగ్రెస్ నాయకులం ఆ కేసు గురించి మాత్రమే మాట్లాడాం తప్ప మరేం మాట్లాడలేదు. మహిళా నాయకులపై బీఆర్ఎస్ చేస్తున్న ట్రోలింగ్ పై కేటీఆర్, హరీష్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది బీఆర్ఎస్ నాయకులు మహిళలకు ఇస్తున్న గౌరవం ఎలాంటిదో అనేది. అయినా తమ పాలనలో మహిళకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్.. మహిళలకు గౌరవం ఏం ఇస్తారులే’ అంటూ పీసీసీ చీఫ్ విమర్శించారు.
సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో విష ప్రచారం చేయిస్తున్నారు. తప్పుడు వార్తలతో విష ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ కు రూ. కోట్లాది పెట్టుబడులు వస్తాయి. తమ హయాంలో హదరాబాద్ ఎంతో అభివృద్ధి జరిగిందంటూ తిమ్మిని బమ్మి చేసి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం జన్వాడ ఫాం హౌస్ చుట్టూ ఉన్న అభివృద్దేనా? లేదా హరీష్, కవిత ఫాం హౌజ్ చుట్టూ జరిగిన అభివృద్దా? పాత బస్తీని కేసీఆర్ అస్సలే పట్టించుకోలేదు’ అంటూ ఆయన బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.