సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సీతారాం ఏచూరి కమ్యూనిస్టు భావజాలానికి ప్రతినిధి అయినప్పటికీ, తమ మధ్య చక్కని స్నేహం వెల్లివిరిసిందని తెలిపారు. సీతారాం ఏచూరి తనకు ప్రియమిత్రుడు అని వెల్లడించారు. ఇద్దరం ఎప్పుడు కలిసినా జాతీయ సమస్యల గురించే మాట్లాడుకునేవాళ్లమని వెంకయ్యనాయుడు వివరించారు.
వక్తగా ఎంతో ప్రభావశీలి అని, స్పష్టత ఉన్న పార్లమెంటేరియన్ అని కొనియాడారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నానని, కానీ అంతలోనే మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.