రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, డెంగీ కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని హెచ్ఓడీలు, డీఎంహెచ్ఓలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో డీఎంహెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధుల కట్టడికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఎలిసా టెస్ట్ (ELISA TEST) బదులు రాపిడ్ టెస్ట్ (RAPID TEST) ద్వారా డెంగ్యూ వ్యాధిని నిర్ధారించి ప్రజలను ఆందోళనలకు గురిచేసే ఆసుపత్రులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
డెంగీ వ్యాధిపై జరుగుతున్న అసత్యపు ప్రచారం పై నిఘా పెట్టాలని మంత్రి దామోదర్ రాజ నర్సింహా ఆదేశించారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి బాధితుల రక్త నమూనాలను సేకరించి వారికి మెరుగైన వైద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికి నీటి నిల్వ కుంటలలో, చెరువులలో ఆయిల్ బాల్స్ లను వెయ్యాలని మంత్రి అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల్లోపు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, డెంగీ పై ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.