హైదరాబాద్ పాతబస్తీ పరిధికి చెందిన బాలాపూర్ ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. గ్యాంగ్ స్టర్ రియాజ్ పై కొందరు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం రాత్రి పది గంటలకు జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న దుండగులు రియాజ్ పై అనుకోకుండా ఒక్కసారిగా దాడి చేశారు. వెంట తెచ్చుకున్న కారం కలిపిన నీళ్లను రియాజ్ కళ్లలో పోశారు. దాంతో ఒక్కసారిగా కళ్లు మండిపోయి అప్రమత్తంగా ఉన్న రియాజ్ ను దుండగులు నాటు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరపగా రియాజ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. రియాజ్ చిరకాల ప్రత్యర్థి నజీర్ పైనే అనుమానాలు వ్యక్తం కావడంతో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరంచేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
రాత్రి పది గంటలకు ఘటన జరగగా.. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు ఘటన ప్రాంతానికి వెంటనే చేరుకున్నారు. రియాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా అసలు అక్కడ ఏ జరిగిందా అని ఆరా తీస్తున్నారు. రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అటుగా ఏ వాహనాలు వెళ్లాయి ? అనుమానాస్పద స్థితిలో తిరిగిన వ్యక్తులు ఎవరు ? అనే అంశాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
పాత గొడవలే కారణమా?
హతుడు రియాజ్ గతంలో చాలా నేరాలతో సంబంధం ఉంది. పలు బెదిరింపులు, హత్యల కేసులలో రియాజ్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. సుమారుగా 5 హత్య కేసులలో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా హతుడు రియాజ్ కు అతని ప్రత్యర్థి నజీర్ కు మధ్య గొడవలు ఉన్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నజీర్ గ్యాంగ్ మనిషి అయిన ఫజల్ అనే వ్యక్తిని హత్య చేయడంతో రియాజ్ పై పగ పెంచుకున్న నజీర్.. అవకాశం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. ఫజల్ హత్య కేసులో ఏ5 గా నజీర్ ఉన్నాడు. దీనితో ఇది పాత కక్షలకు సంబంధించిన వ్యవహారంగా బాలాపూర్ పోలీసులు భావిస్తున్నారు. దీనితో నజీర్ అతని అనుచరులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నజీర్ దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నడిరోడ్డుపై ఇలా హత్యలు జరగడంతో శాంతి భద్రతలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యంపై ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.