కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి
బీఆర్‌ఎస్ తీరుపై కోమటిరెడ్డి ఫైర్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. చచ్చిన పార్టీని బతికించడం కోసమే బీఆర్‌ఎస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేని అని అరికెపూడి గాంధీ చెప్పారు. సచ్చి పోయిన పార్టీని బతికించడం కోసం నాటకాలు అడుతున్నారని అన్నారు. సర్పంచ్ పదవికి కూడా సరిపోని కౌశిక్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రాంత ప్రజల్ని తిట్టడం బీఆర్‌ఎస్ విధానామా అని ప్రశ్నించారు. ప్రాంతీయ సెంటిమెంట్ రగిల్చి బీఆర్‌ఎస్ క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తోందని.. అదే ఆ పార్టీ విధానమా అని ప్రశ్నించారు. ఇప్పటికే అదే సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించారని ఆరోపించారు.
సెటిలర్స్ వల్లే బీఆర్‌ఎస్‌కు సీట్లు..
హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ లేకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చేవా అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఐ ఇమేజ్‌ను దెబ్బతీయడమే బీఆర్‌ఎస్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. నిన్నటి ఘటనలో తాము తులుచుకుంటే బీఆర్‌ఎస్ ఉండేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద, ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడితే కౌంటర్ ఇవ్వాలని, అవసరం అయితే రోడ్ల మీద తిరగకుండా అడ్డుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.