AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేరళ సీఎంను కలిసిన చిరంజీవి.. వయనాడ్ బాధితుల సహాయార్థం రూ. కోటి చెక్కు అందజేత

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఇప్పటికీ చాలా మంది ఆచూకీ తెలియట్లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి. ప్రకృతి వర ప్రసాదంగా భావించే కేరళలో ఇలాంటి విషాద ఘటన జరగడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధాని మోడీతో మొదలు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే తమ వంతు సహాయమందించేందుకు ముందుకొచ్చారు.

ఈ క్రమంలో మెగాస్టార్ ఫ్యామిలీ కూడా వయనాడ్ బాధితులకు అండగా నిలిచింది. బాధితుల సహాయార్థం కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మేరకు గురువారం (ఆగస్టు 08) కేరళ వెళ్లిన చిరంజీవి ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశారు. కోటి రూపాయల చెక్‌ను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వయనాడ్ పరిస్థితిపై చిరంజీవి ఆరా తీశారు. బాధితులకు అంతుతోన్న సాయం గురించి ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కాసేపు ఇద్దరూ పలు అంశాలపై మాట్లాడుకొన్నారు. ప్రస్తుతం చిరంజీవి కేరళ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

కాగా వయనాడ్ బాధితుల సహాయార్థం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే ప్రభాస్ రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. వీరితో పాటు సూర్య, నయనతార, మోహన్‌లాల్‌, కమల్‌ హాసన్‌, విక్రమ్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రష్మిక మందన్నా తదితరులు సైతం వయనాడ్‌ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10