గైనిక్ సమస్యలు తీవ్రమయ్యాయా?
ప్రజాక్షేత్రంలోకి ఇప్పట్లో లేనట్లేనా?
బతుకమ్మ ఉత్సవాలకు సైతం దూరమా?
(అమ్మన్యూస్, హైదరాబాద్):
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఏమైంది?.. మళ్లీ ఆరోగ్య సమస్యలు తిరగబెడుతున్నాయా?.. అవుననే అంటున్నారు పార్టీ నేతలు.. మంగళవారం ఉదయం నగరంలోని ఓ ఆస్పత్రిలో కవిత చేరారు. వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయిని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో కవితకు అనారోగ్యంతోపాటు గైనిక్ సమస్యలు వచ్చాయి. అప్పట్లో దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి హాస్పిటల్‌లో చేరారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశంలోనే సంచలనం..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశంలోనే సంచలనం రేపింది. ఢిల్లీ వేదికగా కొందరు కలిసి మద్యం సిండికేట్‌కు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవిత కూడా నిందితురాలిగా ఉన్నారు. దాంతో అరెస్ట్ చేసి 153 రోజులపాటు తీహార్ జైలులోనే ఉన్నారు. మార్చి 15న అరెస్ట్ అయిన కవిత.. ఆగస్టు 27న బెయిల్‌పై విడుదలయ్యారు. ఇన్ని రోజులు జైలులో ఉన్న కవిత ఆ మధ్య అనారోగ్యానికి గురయ్యారు. పలుమార్లు జ్వరం బారిన పడ్డారు. దాంతో అప్పటికప్పుడు జైలు అధికారులు ఆమెకు చికిత్స చేపించారు. పలు గైనిక్‌తోపాటు ఇతర ఇబ్బందులు వచ్చాయి. దాంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆమెకు చికిత్స చేయించారు. పలు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు.. గైనిక్ సమస్య వచ్చినట్లుగా నిర్ధారించారు.
బెయిల్‌పై విడుదలై నెల రోజులు..
కవిత బెయిల్‌పై విడుదలై నెల రోజులు గడిచింది. దీంతో ఇప్పుడు మరోసారి ఆమెకు అలాంటి సమస్యనే వచ్చినట్లుగా సమాచారం. అందుకే మరోసారి ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకోగా.. ఈ రోజు ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లారు. వైద్యులు ఆమెకు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆమె ట్రీట్‌మెంట్ తీసుకోనున్నారు.
ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు?
అయితే.. కవిత విడుదల సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ వదలబోనంటూ ప్రతినబూనారు. దాంతో బీఆర్‌ఎస్ నేతలంతా కవిత ఎప్పుడెప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తుందా అని ఎదురుచూశారు. నెల రోజులైనా ఇంకా ఆమె బయటకు రాకపోవడంపై అసందృప్తితో ఉన్నారు. అయితే.. తెలంగాణలో బుధవారం నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.
ఏటా బతుకమ్మ పండుగ వచ్చిందంటే కవిత ప్రజల్లోనే ఉండిపోయేవారు. అయితే. ఈసారి ఆమె బతుకమ్మ ఉత్సవాలకు హాజరవుతారా లేదా అన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో హాస్పిటల్‌కు వెళ్లడం కూడా చర్చనీయాంశం అయింది. రేపటి నుంచి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకే ఆమె చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారా? అనే ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చిన రిపోర్టులు, ట్రీట్మెంట్‌ను బట్టి ప్రజల్లోకి వస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు.. ఉన్నట్లుండి కవిత ఆస్పత్రికి వెళ్లడంపైనా బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.