హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు . హైడ్రా పేరుతో సంపన్నులను బెదిరించి వసూళ్ళకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హైడ్రా దాడులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి పై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే, మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీస్తోందన్నారు.
హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుండి వసూళ్లు అయ్యప్ప సొసైటీ అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే…. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైడ్రా కూల్చివేతల పేరుతో బడా బాబుల నుండి వసూళ్లు చేసే తంతుకు తెరదీశారని బండి సంజయ్ ఆరోపించారు.
హైడ్రాపైన బీజేపీ సింగిల్ గానే పోరాటం చేస్తుందని బండి సంజయ్ తేల్చిచెప్పారు. హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటాం హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో బీజేపీ ప్రజలకు ఆయుధంగా మారబోతోందని, తమ ప్రాణాలను అడ్డు పెట్టి అయినా ప్రజల ఆస్తులను కాపాడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు . తమ ప్రాణాలను తీసిన తరువాత పేదల ఇండ్లపైకి హైడ్రా దాడులు చేసుకోవాలన్నారు. హైడ్రా తీరును దేశవ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.