విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. సింగ్ నగర్ లోని వీధుల్లో తిరిగారు. నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధిత కుటుంబాలకు దుప్పట్లు, వాటర్ బాటిళ్లు, ఆహారం అందించారు షర్మిల. ఎవరూ వచ్చి తమను పరామర్శించలేదని, తమకు సాయం చేయలేదని బాధితులు షర్మిలతో వాపోయారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల.. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీలపై విరుచుకుపడ్డారు. ఐదేళ్లు పరిపాలన చేసినా సమస్యను పరిష్కరించలేకపోయారని చంద్రబాబు, జగన్ లపై మండిపడ్డారు షర్మిల. వరద బాధితులకు కేంద్రం ఎందుకు సాయం చేయడం లేదని ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.

”బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సీఎం చంద్రబాబు చూడాలి. ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు.. బుడమేరు వరద నీటికి శాశ్వత పరిష్కారం చూడలేదు. బుడమేరు వరద నీరు మళ్లీ విజయవాడను ముంచెత్తకుండా ప్రభుత్వం పరిష్కారం చూడాలి. రాష్ట్రంలోని మూడు పార్టీలకు చెందిన, వైసీపీకి చెందిన మొత్తం లోక్ సభ, రాజ్యసభ సభ్యులు బీజేపీకి మద్దతిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఇంతవరకు రాష్ట్రంలోని వరద బాధితులకు సాయం ప్రకటించలేదు. కేంద్ర మంత్రులు ఇంతవరకు వరద బాధితులను పరామర్శించలేదు. బాధితులను పరామర్శించని రాష్ట్ర మంత్రులను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.

వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాంగ్రెస్ పార్టీ తరుపున మా సాయం మేం చేస్తున్నాం. ప్రధాని మోదీ వెంటనే వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్రానికి సాయం ప్రకటించాలి. రాష్ట్రానికి సాయం చేస్తారనే కదా చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉండేది. నరేంద్రమోదీని డిమాండ్ చేసి రాష్ట్రానికి కేంద్ర సాయం తీసుకోవాలి. చంద్రబాబు చాలావరకు వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీధులు, సందుగొందుల్లో ఉన్న బాధితులకు సాయం అందడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పూర్తిగా ఇల్లు మునిగిన ప్రాంతాల్లోకి వెళ్లలేదు. అందరికీ సాయం అందాలి. ఎవరూ వచ్చి తమను పరామర్శించి సాయం చేయలేదని వరద బాధితులు చెబుతున్నారు. మహిళలు, చిన్న పిల్లల, వృద్దులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వెంటనే ఆదుకోవాలి” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.

గత పదేళ్లలో ఆక్రమణలు జరిగాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించండి. ఈ విపత్తు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. వరద నీరు కొల్లేరు చేరేలా చర్యలు చేపట్టాలి. ఈ ప్రమాదం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుతం చంద్రబాబు మీదే ఉంది. బుడమేరుకి రిటర్నింగ్ వాల్ కట్టాలి. ఈ విపత్తును వెంటనే మరిచిపోవద్దు. ఈ విపత్తు అసలు మోడీ పరిగణనలోకి వచ్చిందా? బీజేపీతో కూటమి కట్టారు కదా.. మరి బీజేపీ ఎందుకు సపోర్ట్ ఇవ్వడం లేదు? తక్షణ సాయం కేంద్రం ఎందుకు చేయలేదు? అమరావతికి డబ్బులు ఇస్తే ఈ వరదల్లో పోసినట్లేనా? ఒక బ్లూ ప్రింట్ ఉండాలి” అని వైఎస్ షర్మిల అన్నారు.