AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మారుమోగుతున్న శివోహం

శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు
తెలుగురాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు

హైదరాబాద్‌: ఓం నమఃశివాయ, హరహర మహాదేవ.. శంభో శంకర అనే నామస్మరణలతో తెలుగు రాష్ట్రాలు మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంటల కొద్ది క్యూలైన్లలో నిల్చొని లింగాకారుడిని దర్శించుకుంటున్నారు. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలన్న మల్లన్న క్షేత్రం, తెలంగాణలోని వేములవాడ రాజన్న క్షేత్రం శివ శివనామస్మరణతో మారుమోగుతోంది. రాజన్న దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శివయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల రద్దీ పెరగటంతో రాజన్న దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన జరుగనుంది. ఇక రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ సమయంలో శివుడికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. మరోవైపు మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాదేవి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మంత్రి హరీశ్‌రావు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

హనుమకొండలోని ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. త్రినేత్రుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. ముందుగా రుద్రేశ్వరునికి అర్చకులు ఉత్తరాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.

సంగారెడ్డి జిల్లా రaరాసంఘం కేతకి సంగమేశ్వర ఆలయంలోనూ శివరాత్రి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన పార్వతీ సమేత సంగమేశ్వరుని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహా శివుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. సుర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు లింగాకారుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10