AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌కు ఎదురుదెబ్బ.. హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ కొట్టివేత

నర్సింహారెడ్డి కమిషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ కేసీఆర్‌ పెట్టుకున్న రిట్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గత ప్రభుత్వ హయాంలో చత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి ధర్మల్‌ ప్లాంట్ల ఏర్పాటులో అక్రమాలు జరిగాయంటూ వాటిని నిగ్గు తేల్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నర్సింహారెడ్డి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

విచారణ చేపట్టిన కమిషన్‌ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌ను ఆదేశించింది. అయితే, ఆ సమయంలో తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, మరోమారు వస్తానని కమిషన్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత విచారణకు హాజరు కాకపోగా, విచారణ కమిషన్‌ తీరును తప్పుబడుతూ బహిరంగ లేఖ రాశారు. ఆ తర్వాత అసలు కమిషన్‌ ఏర్పాటే చెల్లుబాటు కాదని, దానిని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ దురుద్దేశపూర్వకంగా, ఏకపక్షంగా విచారిస్తోందని, విచారణ పూర్తికాకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని చెప్పిందని ఆరోపించారు.

కేసీఆర్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కేసీఆర్‌ తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం తీర్పును రిజ్వర్వ్‌ చేసిన ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాదుల వాదనతో విభేదించిన న్యాయస్థానం కేసీఆర్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ తన విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10