AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌కు మరో షాక్.. హస్తం గూటికి మరో ఎమ్మెల్యే..!

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకుంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలైన ఈ పర్వం తాజాగా మాజీ స్పీకర్ బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మరోసారి ఈ అంశం తెరమీదకు వచ్చింది.

పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర ఈ ఉదయం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 20 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దీంతో ఎవరెవరు హస్తం గూటికి చేరుకుంటారనే చర్చ మొదలైంది.

ఇదిలా ఉండగా ఈ ఉదయం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వైపుల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ వాదనలను కొట్టిపారేసింది. జానారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి లక్ష్మారెడ్డి వెళ్లారని పార్టీ శ్రేణులు తెలిపాయి. పోచారం వంటి సీనియర్ నేతలే కారు దిగిపోతుండటంతో ఉప్పల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడంలో ఆశ్చర్యం లేదని మరికొందరి వాదన.

ఏది ఎలా ఉన్నా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి కారును షెడ్డుకు తరలించాలనే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి వారు వేస్తోన్న అడుగులు ఈ వాదనలకు బలం చేకూర్చుతుంది. కేసీఆర్, కేటీఆర్ అహంకారమే ఆ పార్టీకి శాపంగా మారిందని మరికొందరి వాదన.

ఉప్పల్ ఎమ్మెల్యే బాటలోనే గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌లు నడుస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే చివరికి కేటీఆర్, కేసీఆర్ మాత్రమే ఆ పార్టీలో ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10